: ముద్రగడ గారూ! ఏ నోటితో ఆ ఆరోపణలు చేస్తున్నారు?: పరిటాల సునీత
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపై ఏపీ మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. తన భర్త పరిటాల రవి హత్య విషయం చంద్రబాబు నాయుడికి ముందే తెలుసంటూ ముద్రగడ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, తన భర్త పరిటాల రవిని నాడు హత్య చేసే విషయం చంద్రబాబునాయుడికి ముందే తెలుసనడం చాలా దారుణమన్నారు. ఈ ఆరోపణలు చేసిన వారు ఏ నోటితో ఇలా మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తూ, చంద్రబాబునాయుడు తనకు దేవుడితో సమానమని అన్నారు. సీనియర్ నాయకుడైన ముద్రగడ పద్మనాభం సీఎం చంద్రబాబు గురించి ఇంత దారుణంగా మాట్లాడుతుండటం చాలా బాధాకరమన్నారు. రాజకీయ లబ్ధి కోసం తన భర్తను వివాదాల్లోకి లాగొద్దని, ప్రాణహాని ఉందని తెలిసి పరిటాల భద్రత కోసం చంద్రబాబు నాడు ఢిల్లీ వెళ్లారని అన్నారు. ముద్రగడ దీక్ష వెనుక వేరే శక్తులున్నాయని, ఆ శక్తులే తెరపైకి వచ్చి దీక్షలు చేస్తే బాగుంటుందని సునీత అన్నారు.