: జగన్ డైరెక్షన్... ముద్రగడ యాక్షన్!: కాపు నేత దీక్షపై చలమలశెట్టి సెటైర్లు
కాపుల రిజర్వేషన్ల కోసం రోడ్డెక్కిన కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై టీడీపీ నేతల మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. తుని విధ్వంసకారులంటూ అరెస్ట్ చేసిన కాపు యువకులను తక్షణమే విడుదల చేయాలని, కాపులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలన్న డిమాండ్ తో నేటి ఉదయం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన సొంతింటిలో ఆమరణ దీక్షకు దిగిన ముద్రగడపై కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన రామానుజయ... ముద్రగడ దీక్ష వెనుక వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డైరెక్షన్ ఉందని ఆరోపించారు. జగన్ డైరెక్షన్ లోనే ముద్రగడ దీక్ష కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. ముద్రగడ ఎన్ని దీక్షలు చేసినా...కాపులంతా తమ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు వెంటే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.