: జాతి కోసం ప్రాణ త్యాగానికి సిద్ధం!... ఆమరణ దీక్ష ప్రారంభించిన ముద్రగడ!
కాపు జాతి కోసం ప్రాణత్యాగానికి కూడా వెనుకాడేది లేదని కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేశారు. తుని విధ్వంసకారుల పేరిట కాపులపై పెట్టిన కేసుల ఎత్తివేత, అరెస్టైన కాపు యువకుల విడుదల తదితర డిమాండ్లు నెరవేరని నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన సొంతింటిలో కొద్దిసేపటి క్రితం ఆయన ఆమరణ దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్ష విరమించేది లేదని చెప్పిన ముద్రగడ... అరెస్ట్ చేసినా జైలులో కూడా దీక్షను కొనసాగిస్తానని చెప్పారు. ఇంటిలో ఉంటే కనీసం మంచి నీరు తాగుతానని, అదే జైలుకెళితే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. కాపులకు ఇచ్చిన హామీలను టీడీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిన కారణంగానే తాను దీక్షకు దిగుతున్నట్లు ముద్రగడ చెప్పారు. ముద్రగడతో పాటు ఆయన సతీమణి, కుటుంబ సభ్యులు, కాపు నేతలు కూడా ఆయనతో పాటే దీక్ష ప్రారంభించారు.