: ఎట్టకేలకు బెజవాడ బాటలో వైసీపీ!... 14న పార్టీ రాష్ట్రస్థాయి సర్వసభ్య సమావేశం
రాష్ట్ర విభజన తర్వాత దాదాపుగా అన్ని పార్టీల ఏపీ కార్యకలాపాలు నవ్యాంధ్ర పొలిటికల్ కేపిటల్ గా మారిన విజయవాడ నుంచే సాగుతున్నాయి. ఏపీలో అధికార పార్టీ టీడీపీ అన్ని రకాల సమావేశాలను విజయవాడలోనే నిర్వహిస్తోంది. ఈ భేటీలకు టీ టీడీపీ నేతలు కూడా అక్కడికి తరలివెళుతున్నారు. ఇక వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ తదితర అన్ని పార్టీలు అక్కడే తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి. ఇక రాష్ట్ర విభజన జరిగితే తమ పార్టీ కార్యకలాపాలను విజయవాడకు తరలిస్తామని అందరికంటే ముందు చెప్పిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటికీ దానికి కార్యరూపం దాల్చలేదు. పార్టీకి సంబంధించి ఏ సమావేశం జరిగినా.. హైదరాబాదులోని లోటస్ పాండ్ లో నిర్మించిన పార్టీ కార్యాలయంలోనే జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు పార్టీకి చెందిన ఏపీ నేతలంతా హైదరాబాదుకు తరలిరావాల్సిన పరిస్థితి నెలకొంది. జగన్ ను కలవాలనుకునే పార్టీ సీనియర్ల దగ్గర నుంచి సామాన్య కార్యకర్త దాకా దూరమైనా హైదరాబాదు రావాల్సిందే. ఈ పరిస్థితిపై కాస్తంత ఆలస్యంగా మేల్కొన్న జగన్ తాజాగా బెజవాడ బాట పట్టారు. ఈ నెల 14న నిర్వహించతలపెట్టిన పార్టీ రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశాన్ని బెజవాడలోనే నిర్వహించనున్నట్లు ఆయన నిన్న ప్రకటించారు.