: దేవతలు మంచి పనులు చేస్తుంటే రాక్షసులు అడ్డుతగిలే వారు.. జగన్ కూడా అంతే!: గంటా
అన్ని రాష్ట్రాలు పండుగలా రాష్ట్రావతరణ దినోత్సవాన్ని జరుపుకుంటాయని, కానీ ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణ దీక్ష జరుపుకుంటోందని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. కడపలో నిర్వహిస్తోన్న మహా సంకల్ప యాత్ర వేదికపై ఆయన ఈరోజు మాట్లాడుతూ.. మన రాష్ట్రం ఎదుర్కుంటోన్న పరిస్థితి విచిత్రమైనదని ఆయన పేర్కొన్నారు. విభజనతో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ, కసితో అభివృద్ధి చెయ్యాలని దీక్ష చేపడుతున్నామని ఆయన చెప్పారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని కృషి చేస్తున్నామని గంటా అన్నారు. ‘లక్ష్య సాధనలో ఎన్ని ఒడిదుడుకులొచ్చినా అభివృద్ధి తథ్యం’ అని ఆయన వ్యాఖ్యానించారు. మన రాష్ట్రంలో అనుభవం లేని, అసమర్థ ప్రతిపక్ష నాయకుడున్నాడని ఆయన జగన్ ని ఉద్దేశించి అన్నారు. ‘ఆయన భాష అభ్యంతరకరం.. ముఖ్యమంత్రిపైనే అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తున్నారు..’ అని ఆయన అన్నారు. ‘దేవతలు మంచి పనులు చేస్తుంటే రాక్షసులు వాటిని పాడు చేయడానికి ప్రయత్నించే వారు. రుషులు యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు పాడు చేసేవారు.. ప్రతిపక్ష నేత జగన్ కూడా రాక్షసుడిలా రాష్ట్రాభివృద్ధి పనులకు అడ్డుతగులుతున్నార’ని ఆయన వ్యాఖ్యానించారు.