: సీడ్ కంపెనీ దాష్టీకం!... మీడియా సిబ్బందిని నిర్బంధించిన వైనం!


నకిలీ విత్తనాలతో రైతులను నట్టేట ముంచుతున్న ఓ సీడ్ కంపెనీ... తన అక్రమాలను వెలికితీసేందుకు వచ్చిన మీడియా సిబ్బందిని నిర్బంధించింది. మీడియా ప్రతినిధుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు సదరు సీడ్ కంపెనీపై దాడి చేసి రూ.2 కోట్ల విలువ చేసే నకిలీ విత్తనాలను సీజ్ చేశారు. వివరాల్లోకెళితే... తెలంగాణలోని పాలమూరు జిల్లా కేంద్రం మహబూబ్ నగర్ కు కూతవేటు దూరంలోని భూత్పూర్ కు చెందిన గోపీకృష్ణ సీడ్ కంపెనీ కొంతకాలంగా నకిలీ విత్తనాలతో రైతులను ముంచుతోంది. దీనిపై సమాచారం అందుకున్న ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు చెందిన మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లారు. మా అక్రమాలనే వెలికితీస్తారా? అంటూ సదరు కంపెనీ ప్రతినిధులు మీడియా సిబ్బందిని గోడౌన్ లో నిర్బంధించారు. ఎలాగోలా మీడియా సిబ్బంది తమ సెల్ ఫోన్ల ద్వారా తెలంగాణ విజిలెన్స్ అధికారులకు సమాచారం చేరవేశారు. క్షణాల్లో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు సదరు సీడ్ కంపెనీ గోడౌన్ పై మెరుపు దాడి చేశారు. మీడియా ప్రతినిధులను రక్షించిన విజిలెన్స్ అధికారులు గోడౌన్ లో భారీగా నిల్వ ఉంచిన నకిలీ విత్తనాలను సీజ్ చేశారు. ఈ విత్తనాల విలువ రూ.2 కోట్ల మేర ఉంటుందని తేల్చారు. ఆ తర్వాత కంపెనీపై కేసు నమోదు చేసిన విజిలెన్స్ అధికారులు గోడౌన్ ను సీజ్ చేశారు.

  • Loading...

More Telugu News