: జగన్ చేతిలో ముద్రగడ కీలుబొమ్మ!... పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల ఘాటు వ్యాఖ్య
కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై టీడీపీ వరుస దాడులు చేస్తోంది. తుని విధ్వంసానికి కారకులుగా భావిస్తూ పోలీసులు అరెస్ట్ చేసిన కాపు యువకుల విడుదల కోసం నిన్న హైడ్రామా సృష్టించిన ముద్రగడపై ఇప్పటికే ఆయన సామాజిక వర్గానికే చెందిన గంటా శ్రీనివాసరావు, నిమ్మకాయల చినరాజప్పలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కూడా ముద్రగడపై విరుచుకుపడ్డారు. కొద్దిసేపటి క్రితం ఆయన తన సొంతూళ్లోనే మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతిలో ముద్రగడ కీలుబొమ్మగా మారారని ఆరోపించారు. విధ్వంసకారులకు మద్దతు తెలుపుతున్న ముద్రగడ న్యాయవ్యవస్థను కించపరుస్తున్నారని ధ్వజమెత్తారు. అరెస్టైన నిందితులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ.. అన్నం తినను, కారు దిగబోను అంటూ పిచ్చి నాటకాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముద్రగడ తన పధ్ధతి మార్చుకోకపోతే ఆయనకు వ్యతిరేకంగా ఉద్యమానికి దిగాల్సి వస్తుందని కూడా నిమ్మల హెచ్చరించారు.