: ముద్రగడ డిమాండ్లను ఒప్పుకునేది లేదు!... ఆయనదే చెక్క భజన: డిప్యూటీ సీఎం చినరాజప్ప
కాపు రిజర్వేషన్లే లక్ష్యంగా ఉద్యమంలోకి దూకిన కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై టీడీపీ నేతలు, మంత్రుల వరుస దాడులు మొదలయ్యాయి. తుని విధ్వంసం పేరిట అరెస్ట్ చేసిన కాపు యువకులను బేషరతుగా విడిచిపెట్టడమే కాకుండా వారిపై నమోదు చేసిన కేసులను తొలగించాలని, లేని పక్షంలో రేపు మరోమారు దీక్షకు దిగుతానని ముద్రగడ ప్రకటించిన సంగతి తెలిసిందే. ముద్రగడ డిమాండ్లపై కొద్దిసేపటి క్రితం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ఫైరయ్యారు. రిమాండ్ లో ఉన్న నిందితులపై కేసులు కొట్టేయడం ఎలా సాధ్యమో ముద్రగడే తెలపాలన్నారు. కోర్టులంటే ముద్రగడకు గౌరవం లేకుండా పోయిందని ఆయన విరుచుకుపడ్డారు. సాధ్యం కాని డిమాండ్లు కోరుతున్నందున ముద్రగడ డిమాండ్లకు అంగీకరించే పరిస్థితే లేదని చినరాజప్ప స్పష్టం చేశారు. అవసరమైతే ముద్రగడపైనా కేసులు నమోదు చేసేందుకు వెనుకాడబోమని కూడా చినరాజప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపులకు రిజర్వేషన్లిస్తామని హామీ ఇచ్చిన తాము చెక్కభజన చేస్తున్నామని ముద్రగడ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తన 30 ఏళ్ల క్రియాశీల రాజకీయాల్లో ముద్రగడ చేసిన దానినే చెక్కభజన అంటారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.