: కిడ్నీ రాకెట్ లో అపోలో పాత్ర ఎంత?... పోలీసులకు చిక్కిన రాజ్ కుమార్!
దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేపిన కిడ్నీ రాకెట్ కు సంబంధించి కీలక నిందితుడు ఏపీకి చెందిన రాజ్ కుమార్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఢిల్లీలోని అపోలో ఆసుపత్రి కేంద్రంగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న కిడ్నీ రాకెట్ వ్యవహారం ఓ మహిళ ఫిర్యాదుతో వెలుగుచూసిన సంగతి తెలిసిందే. వెనువెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు అపోలో ఆసుపత్రి సిబ్బందితో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. అయితే ఈ రాకెట్ ను అంతా తానై వ్యవహరిస్తున్న రాజ్ కుమార్ మాత్రం పోలీసులకు చిక్కలేదు. పోలీసు దాడులపై కాస్తంత ముందుగానే సమాచారం అందుకున్న రాజ్ కుమార్ చిన్నగా జారుకున్నాడు. దక్షిణ భారత దేశంలోని పలు ప్రాంతాల్లో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ వ్యవహారాల్లోనూ రాజ్ కుమారే కీలక నిందితుడిగా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో అతడి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన పోలీసులు ఎట్టకేలకు నిన్న రాత్రి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో అతడిని అరెస్ట్ చేశారు. ఇక ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారిగా వ్యవహరించిన రామారావు అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రెండు అరెస్టులతో అసలు కిడ్నీ రాకెట్ లో అపోలో ఆసుపత్రి పాత్ర ఎంత ఉందన్న విషయం తేలిపోనుంది.