: నేను రాజీనామా చేశాను...మరి నువ్వెప్పుడు?: మంత్రికి సవాల్ విసిరిన కర్ణాటక మహిళా డీఎస్పీ
గత వారం రోజులుగా కర్ణాటకలో మహిళా డీఎస్పీ అనుపమ షణై, కార్మిక శాఖ మంత్రి పీటీ.పరమేశ్వర్ మధ్య వివాదం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. అక్రమార్కులపాలిట సింహస్వప్నంగా నిలిచిన అనుపమ తాజాగా మంత్రి పరమేశ్వర్ ఫేస్ బుక్ పేజ్ లో 'నేను రాజీనామా చేశాను. పరమేశ్వర్ నాయక్...మరి నువ్వెప్పుడు?' అంటూ ఒక ఆసక్తికర కామెంట్ పోస్టు చేశారు. ఇదిప్పుడు కర్ణాటకలో కలకలం రేపుతోంది. కాగా, కుడ్గిగి ప్రాంతంలో నేరాల నివారణకు, పేదల పట్ల పోరాటానికి పోలీసు అధికారిణి అనుపమ చేపట్టిన చర్యలు మంత్రి పరమేశ్వరన్ కు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. దీంతో పలు సందర్భాల్లో ఆమెకు వ్యతిరేకంగా ఆయన ఆందోళనలు చేపట్టారు. ఓ లిక్కర్ షాపు వివాదంలో ముగ్గురు వ్యక్తుల అరెస్టులకు నిరసనగా ఆమెతో ఓ చిన్నపాటి యుద్ధమే జరిగింది. మంత్రిగారి ఫోన్ కాల్స్ కు సమాధానం ఇవ్వలేదన్న కారణంతో ఆమెను రెండుసార్లు బదిలీ చేశారు. ఇలాంటి చర్యలతో విసిగిపోయిన అనుపమ ఇప్పుడు తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేసినట్టు చెబుతున్నారు. అయితే ఆమె రాజీనామాపై భగ్గుమన్న స్థానికులు, ఆమెకు మద్దతుగా ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.