: హాలీవుడ్ చిత్రాలు ప్రాంతీయ చిత్రాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి: అమితాబ్ బచ్చన్
హాలీవుడ్ చిత్ర పరిశ్రమ చాలా శక్తిమంతమైందని, అది ఎక్కడికి వెళితేే అక్కడ ప్రాంతీయ చిత్రాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అన్నారు. యూకే, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, జపాన్ వంటి దేశాలు సహా మనదేశంలోనూ హాలీవుడ్ చిత్రాలు విడుదలవుతూ ఇక్కడి ప్రాంతీయ చిత్రాలను దెబ్బతీస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా హాలీవుడ్ లో తనని ఆశ్చర్యానికి గురి చేసిన ఒక సంఘటన గురించి వివరించారు. తాను సెలవుల్లో అమెరికాకు ఎక్కువగా వెళ్తుంటానని, ఈ క్రమంలో 1995లో ఓసారి అక్కడికి వెళ్లానని చెప్పారు. అయితే, అక్కడి వార్నర్, సోనీ వంటి హాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు తనను కలవాలంటూ పలుసార్లు లేఖలు రాశాయని, వాటిని తాను పట్టించుకోలేదని అన్నారు. అగ్ర నిర్మాణ సంస్థలు తనను ఎందుకు కలవాలనుకుంటున్నాయనే సందేహం తనకు తరచుగా వస్తుండేదన్నారు. ఈ విషయాన్ని న్యూయార్క్ లో ఉన్న తన న్యాయవాది మిత్రుడికి చెప్పానని, అతని సలహా మేరకు ఒక్కసారి వెళ్లి కలవగా, తాను కలిసిన ఒక ప్రముఖ వ్యక్తి చెప్పిన విషయాలను విని ఆశ్చర్యపోయానని బిగ్ బీ చెప్పారు. అక్కడ ఒక ప్రముఖ స్టూడియో చీఫ్ ను తాను కలిశానని, ఆయన సుమారు గంటపాటు ఏకధాటిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడారన్నారు. భారతీయ సినిమాల నిర్మాణం, బడ్జెట్టు, కలెక్షన్లు, డిస్ట్రిబ్యూషన్, ఫైనాన్స్.. ఇలా ప్రతిదాని గురించి ఆయన క్షుణ్ణంగా చెప్పడం విని ఆశ్చర్యపోయానన్నారు. మన సినిమాల పట్ల వాళ్లు ఎంతగా రీసెర్చ్ చేశారన్నది అర్థమైంది. ఆ తర్వాత, ఇక్కడ విన్న విషయాలన్నింటినీ న్యాయవాది మిత్రుడికి చెప్పానని అన్నారు. అప్పుడు ఆయన అసలు విషయం చెప్పారని, ‘మిస్టర్ బచ్చన్, మీరు మీ దేశానికి వెళ్లండి. మీ సినీ పరిశ్రమను చక్కదిద్దుకోండి. ఎందుకంటే, ఆయన చెప్పిన దానిని బట్టి చూస్తే, మీ దేశానికి త్వరలోనే అమెరికన్లు రాబోతున్నారు. అందుకే మీ సినిమాలపై వాళ్లు అంతగా స్టడీ చేశారు. త్వరలోనే వాళ్ల సినిమాలను మీ మీద వదులుతారు. మీరు జాగ్రత్త పడకపోతే మీ పరిశ్రమ కోలుకోలేని విధంగా దెబ్బతింటుంది. అక్కడ తిష్ట వేస్తారు’ అంటూ ఆయన హెచ్చరించారని బిగ్ బీ పేర్కొన్నారు. హాలీవుడ్ చిత్రాలు మనదేశంలో రిలీజ్ అయి భారీ వసూళ్లు రాబట్టుకుంటాయని, మన చిత్రాలకు అవి పెద్ద నష్టం కలిగిస్తాయన్న విషయాన్ని ఏబీసీఎల్ నిర్మాణ సంస్థను స్థాపించినప్పుడే తాను ఊహించానని బిగ్ బీ పేర్కొన్నారు.