: ముద్రగడను అరెస్ట్ చేయలేదు!... కాపులూ రోడ్డెక్కొద్దు!: ‘తూర్పు’ ఎస్పీ ప్రకటన
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ కొద్దిసేపటి క్రితం ఓ ఆసక్తికర ప్రకటన చేశారు. జిల్లాలోని తునిలో చోటుచేసుకున్న కాపుల ధ్వంసరచన గుర్తుకు వచ్చిందో, ఏమో తెలియదు కాని... నేటి ఉదయం కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి జిల్లాలోని అమలాపురం పోలీస్ స్టేషన్ కు వచ్చిన వెంటనే రంగంలోకి దిగిన ఎస్పీ కొద్దిసేపటి క్రితం బహిరంగ ప్రకటన చేశారు. ముద్రగడను తాము అరెస్ట్ చేయలేదని ఆయన ప్రకటించారు. ముద్రగడే స్వయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి తనను అరెస్ట్ చేయాలని బైఠాయించారని ఆయన తెలిపారు. అరెస్ట్ చేయమని ముద్రగడ కోరినా... తాము మాత్రం ఆయనను అరెస్ట్ చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. ముద్రగడ అరెస్టయ్యారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ఆయన కాపులకు సూచించారు. ఈ క్రమంలో ఎలాంటి ఉద్రేకాలకు, ఆవేశానికి లోను కావద్దని ఆయన కాపులను కోరారు. తునిలో ధ్వంసరచనకు దిగిన కాపులు రత్నాంచల్ ఎక్స్ ప్రెస్ కు నిప్పు పెట్టడంతోనే ఆగిపోకుండా పట్టణంలోని పోలీస్ స్టేషన్లపై ముప్పేట దాడి చేశారు. పోలీసులపై విచక్షణారహితంగా దాడికి దిగారు. పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. వేలాది మంది కాపులు ఒక్కసారిగా మీద పడటంతో పోలీసులు నిశ్చేష్టులయ్యారు. ఆ షాక్ నుంచి పోలీసులు తేరుకునేలోగానే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. నాటి ఘటనను గుర్తు చేసుకున్న క్రమంలోనే ఆ జిల్లా ఎస్పీ ఈ ప్రకటన చేసినట్లు సమాచారం.