: కనీస జ్ఞానం లేకుండా టాపర్లుగా నిలిచిన విద్యార్థులు, సహకరించిన అధికారులపై ఎఫ్ఐఆర్ కు బీహార్ సీఎం ఆదేశం
బీహారులో ఇటీవల వెలుగులోకి వచ్చిన 'టాపర్ స్కామ్'పై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, నిందితులందరినీ అదుపులోకి తీసుకోవాలని బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆదేశించారు. కేసును విచారిస్తున్న రెండు కమిటీలను పక్కనబెడుతూ, విద్యా శాఖ అధికారులు స్వయంగా విచారించాలని, స్కామ్ వెనుక భాగస్వాములైనవారందరికీ కఠిన శిక్షలు పడేలా చూడాలని ఆయన తెలిపారు. సెక్రటేరియట్ లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన, ఏదో పెద్ద తప్పు జరిగిపోయినట్టు కంటికి స్పష్టంగా కనిపిస్తోందని, జరిగిన నష్టాన్ని వెంటనే పూడ్చాలని ఆయన సూచించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, విష్ణు రాయ్ కాలేజీలో పరీక్షలు రాసిన కొంతమంది విద్యార్థులు వివిధ సబ్జెక్టుల్లో టాపర్లుగా నిలువగా, వీరికి ఆయా సబ్జెక్టులలో కనీస పరిజ్ఞానం కూడా లేవని వెల్లడైన సంగతి తెలిసిందే.