: దండయాత్రకే కోదండరాం సిద్ధం!... కేసీఆర్ సర్కారుపై మరోమారు ధ్వజమెత్తిన జేఏసీ చైర్మన్!
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావడంలో ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ) చైర్మన్ హోదాలో ప్రొఫెసర్ కోదండరాం కీలక భూమికే పోషించారు. ఈ విషయం జగమెరిగిన సత్యమే. అయితే జేఏసీ ఆశించిన మేర కేసీఆర్ సర్కారు పనిచేయడం లేదన్న కోణంలో మొన్న కీలక వ్యాఖ్యలు చేసిన కోదండరాం... సర్కారుపై దండయాత్రకే సిద్ధమన్నట్లు నిన్న మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్ జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్, వేములఘాట్ గ్రామాల్లో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు పరిధిలోని గ్రామస్తులతో ఆయన నిన్న భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోదండరాం... కేసీఆర్ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తోడేళ్లు గొర్రెల మంద మీద పడ్డ చందంగా తెలంగాణ ప్రభుత్వం భూమిని నమ్ముకున్న రైతులపై పడుతోందని ఆయన ధ్వజమెత్తారు. ప్రజాభిప్రాయం లేకుండా భూసేకరణ ఎలా చేస్తారంటూ నిలదీశారు. గత పాలకుల బాటలోనే నడుస్తున్న ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపించారు. తహశీల్దార్ల పేరిట జరుగుతున్న రిజిస్ట్రేషన్లపై ఆయన మండిపడ్డారు. జీవో 123కి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తామని ఆయన ప్రకటించారు. కేవలం 50 టీఎంసీల కోసం ఏకంగా 14 ఊళ్లను ఖాళీ చేయిస్తారా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మల్లన్నసాగర్ బాధితులకు కడదాకా అండగా నిలుస్తామని కోదండరాం ప్రకటించారు.