: ఈ 'అమరావతి' ఫ్లైట్ ఆన్ వీల్స్... సదుపాయాలివే!


ఎక్కగానే నవ్వుతూ పలకరించే అటెండెంట్, సామాన్లు అందుకుని ర్యాక్ లో పెట్టి, సీటులో కూర్చోగానే చాక్లెట్ లు తెచ్చిచ్చి, ఆపై మంచినీరు, తినుబండారాలు, ముందుగా ఆర్డర్ చేస్తే మీల్స్... వీటన్నింటికీ మించి ఇన్డివిడ్యువల్ ఎంటర్ టెయినింగ్ సిస్టమ్... ఆగండి...! ఇదేదో విమానం గురించి చెబుతున్నది కాదు. నవ్యాంధ్రలో నిన్న చంద్రబాబునాయుడు ప్రారంభించిన 'అమరావతి' బస్సుల గురించి. ఈ బస్సుల్లో తొలిరోజు ప్రయాణం చేసిన వారు 'వాహ్... సూపర్బ్' అంటున్నారు. వాస్తవానికి గరుడా ప్లస్ (మల్టీ యాక్సిల్ బస్సులు) బస్సులకే అమరావతి అని పేరు పెట్టి చార్జీలు మరికాస్త పెంచినపుడు ప్రయాణికుల నుంచి విమర్శలు వచ్చాయి. ఉన్న బస్సులకే అమరావతి అని పేరు పెట్టారని ప్రజలు తిట్టిపోశారు కూడా. ఇక వీటిలో సౌకర్యాలు విమానాల్లోలా మార్చాలని భావించిన ఏపీ సర్కారు, ప్రతి సీటుకూ ఓ ఎల్ఈడీ మానిటర్, దాన్ని ఆపరేట్ చేసే బటన్లు హ్యాండ్ రెస్ట్ పై, పక్క వారికి ఇబ్బంది కలుగకుండా హెడ్ ఫోన్స్ అమర్చింది. ఇక వీటిల్లో ప్రయాణికులకు మరింత అనుభూతి కలిగించేందుకు సిబ్బందికి శిక్షణ ఇచ్చి నియమించింది. వీరంతా ప్రయాణికులతో ఫ్లైట్ అటెండెంట్ల మాదిరే మర్యాదగా వ్యవహరిస్తారు. బస్సులో తాగునీరు, చలివేస్తే బ్లాంకెట్, చిప్స్, కుర్ కురే వంటి స్నాక్స్ (కొనుక్కోవాలి సుమా) అందుబాటులో ఉంచింది. ఇక కొసమెరుపు ఏంటంటే, రెండు పెగ్గులు మందేసి బస్సెక్కి హాయిగా నిద్రపోదామని భావించిన వారికి ఈ బస్సుల్లో ఇబ్బందులు తలెత్తాయి. మద్యం సేవించి బస్సెక్కిన కొంత మందిని డ్రైవర్లు అడ్డుకున్నారు. ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని వారు వాదించగా, వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ముందుగా సమాచారం లేకుండా టికెట్లు బుక్ చేసుకున్నవారిని ఇబ్బందులు పెడుతున్నారని కొందరు గొడవ పెట్టుకోగా, ఆర్టీసీ అధికారులు కల్పించుకుని వారిని బస్సెక్కనిచ్చారు. అమరావతి బస్సుల్లో మద్యం సేవించిన వారిని ఎక్కనీయబోమని ముందస్తు ప్రచారం చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News