: ఇండియాకు 'హ్యాట్రిక్ లక్' తగిలేనా?
ప్రపంచాన్ని గడగడలాడించిన 2008 నాటి ఆర్థిక మాంద్యం నుంచి మిగతా దేశాలతో పోలిస్తే, త్వరితగతిన తేరుకుని, ప్రస్తుతం శరవేగంగా వృద్ధిని నమోదు చేస్తున్న ఇండియా, గడచిన ఎనిమిదేళ్లలో రెండు సార్లు వృద్ధి బాటన దూసుకెళ్లి లక్కీగా నిలిచింది. ఇప్పుడు తాజాగా పరిశ్రమల ఆర్థిక గణాంకాలు సైతం అదే దిశగా సాగుతుండగా, ఇండియాకు హ్యాట్రిక్ లక్ తగిలేనా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం కార్పొరేట్ల లాభాలు, ఆదాయ వృద్ధి, 2008 నాటి పతనం తరువాత మూడవసారి అప్ ట్రెండ్ లో కనిపిస్తున్నాయి. 2008 తరువాత రెండుసార్లు ఇలాగే లాభాల బాటన ఏడాది పాటు నడిచిన భారత కార్పొరేట్లు, ఆపై కనిష్ఠాలకు పడిపోయాయి. దాదాపు 724 లిస్టెడ్ కంపెనీల త్రైమాసిక ఫలితాలను (బ్యాంకులు, చమురు కంపెనీలు మినహా) విశ్లేషించిన మార్కెట్ నిపుణులు తదుపరి మూడు త్రైమాసికాలూ భారత్ కు అత్యంత కీలకమని వ్యాఖ్యానిస్తున్నారు. 2008లో యూఎస్ లోని లీమన్ బ్రదర్స్ దివాలా తీసిన తరువాత ఏర్పడిన మాద్యం, అన్ని దేశాలనూ కుదేలు చేయగా, కాంగ్రెస్ నేతృత్వంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం తెచ్చిన ఉద్దీపన ప్యాకేజీ కార్పొరేట్ సంస్థలకు లక్కీగా మారి దూసుకెళ్లేలా చేసింది. ఈ వృద్ధి చక్రం సప్టెంబర్ 2009తో ముగిసిన త్రైమాసికం వరకూ కొనసాగింది. ఆపై జూన్ 2013 త్రైమాసికంలో ఆనాటి తాజా కనిష్ఠాలకు మార్కెట్లు కుప్పకూలిన వేళ, రూపాయి పతనం భారత వృద్ధికి కలిసొచ్చింది. పడిపోయిన రూపాయి విలువ ఐటీ, ఫార్మా కంపెనీలకు వరంగా మారగా, టీసీఎస్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, లుపిన్, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఆటో వంటి ఎన్నో కంపెనీల విదేశీ ఆదాయాన్ని పెంచి భారత వృద్ధిని ఉన్నత స్థితికి చేర్చాయి. ఈ సైకిల్ ఏడాది పాటు అంటే జూన్ 2014 వరకూ సాగింది. అటు తరువాత నరేంద్ర మోదీ పాలన ప్రారంభం కాగా, చైనా భయాలు, యూఎస్ ఫెడ్ నిర్ణయాలు, యూరోజోన్ అనిశ్చిత స్థితి, పెరిగిన ఉగ్రవాదుల భయాలు వంటి కారణాలతో పడుతూ, లేస్తూ సాగిన మార్కెట్లు, ఇప్పుడు నిలదొక్కుకుని ఆకాశానికి ఎదగడం ప్రారంభించాయి. "తాజా ఆదాయ గణాంకాలను, వృద్ధి అంచనాలనూ పరిశీలిస్తే, మరో ఏడాది పాటు ఇదే తరహా గ్రోత్ రేట్ నమోదవుతుందని అనుకుంటున్నాను. రుతుపవనాలు బాగుండి, కీలక సంస్కరణలు అమలైతే భారత్ హ్యాట్రిక్ లక్కీ సాధించినట్టే" అని ఈక్వానమిక్స్ రీసెర్చ్ అండ్ అడ్వయిజరీ సంస్థ సీఈఓ జీ చొక్కలింగం అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి భారత మార్కెట్ పై బుల్లిష్ ధోరణిలోనే విదేశీ ఇన్వెస్టర్లు ఉన్నారని, అయితే, మరో రెండు త్రైమాసికాల్లో ఫలితాలను చూసిన తరువాతే ఓ అంచనాకు రాగలమని ఎడిల్ వైజస్ కాపిటల్ ప్రెసిడెంట్ నితిన్ జైన్ అభిప్రాయపడ్డారు.