: ‘1’ కోసం రూ.32 కోట్లు ఖర్చు చేసిన అరబ్ షేక్!
ఇష్టపడి కొనుకున్న కార్లకు ఇష్టమైన నెంబర్ల కోసం జనాల్లో వేలం వెర్రి మనకు తెలిసిందే. కోరుకున్న నెంబర్ కోసం లక్షలు తగలేసేందుకు వెనుకాడని ప్రముఖులు కూడా మనకు కొత్తేమీ కాదు. అయితే మొన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరిగిన ఫ్యాన్సీ నెంబర్ల వేలం చూస్తే మాత్రం మనకు నోట మాట రాదు. ముచ్చటపడి కొనుక్కున్న కారుకు ‘1’ నెంబర్ కోసం ఆ దేశానికి చెందిన ఓ అరబ్ షేక్ ఏకంగా రూ.32 కోట్లు తగలేశాడు. యూఏఈలో వ్యాపారిగా బాగానే వెనకేసిన అహ్మద్ అల్- జరౌనీ... తాను కోరుకున్న ‘1’ నెంబర్ కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ‘‘ఎప్పుడూ నెంబర్ వన్ గా ఉండటమే నా లక్ష్యం. షార్జాలో రిజిస్ట్రేషన్ చేసిన కారు కోసం ఈ నెంబర్ కొన్నాను’’ అని జరౌనీ చెప్పాడు. ఇదిలా ఉంటే... ‘1’ నెంబర్ తో పాటు ‘12’, ‘22’, ‘50’, ‘100’, ‘777’, ‘1000’, ‘2016’, ‘2020’ నెంబర్లను కూడా వేలం వేసిన నిర్వహణ సంస్థ ఏకంగా రూ.91 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.