: సీఎంకు కోపం రావడం లేదు కానీ, ఆయన భజనపరులకు మాత్రం కోపమొస్తోంది!: ముద్రగడ పద్మనాభం
‘నా గురించి ముఖ్యమంత్రి గారికి కోపం రావడం లేదు కానీ, ఆయన భజనపరులకు మాత్రం కోపమొస్తోంది’ అని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కాపు ఉద్యమం కోసం తానే బలి అవుతాను కానీ, ఎవర్నీ బలిచేయనని అన్నారు. తాను ఇంట్లో కూర్చోవాలో, రోడ్డెక్కాలో చెప్పాల్సింది చంద్రబాబేనని, కాపులను తాకట్టు పెట్టేవాడిని కాదని అన్నారు. కాపు జాతి కోసం గతంలో ఎన్నో పదవులకు తాను రాజీనామా చేశానని, పదవులు ఆశించేవాడిని కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. తనకు పదవి ఇస్తామని చెప్పే ధైర్యం కూడా ఎవరికీ లేదన్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చంద్రబాబులా వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంటింటికీ తిరిగి చెప్పలేదని, 1994లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను అడ్డుకుంది చంద్రబాబేనని అన్నారు. కాపుల కోసం జీవో తెచ్చి రాజకీయంగా తాను బలైపోయానని, తనలా పదవులకు రాజీనామాలు చేసిన మొనగాడు దేశంలోనే లేరని అన్నారు. ఇటీవల జరిగిన తుని విధ్వంస ఘటన వెనుక ఎవరున్నారో సమయం వచ్చినప్పుడు చెబుతానని ముద్రగడ పేర్కొన్నారు.