: ఇటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతికి వెళ్లేందుకు సిద్ధమే: ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం
అమరావతిలో కార్యాలయాలను చూడటంలో హెచ్ఓడీ లు ఎంతవరకు సక్సెస్ అయ్యారో చెప్పాలని, ఆ కార్యాలయాలను ఉద్యోగులు చూసిన తర్వాత, దగ్గర్లో ఇళ్లు వెతుక్కోవాలని, ఆ తర్వాత పిల్లల కోసం మంచి స్కూళ్లు వెతుక్కోవాలని... అయినా ఇటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతికి తరలివచ్చేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఈరోజు నిర్వహించిన ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యాలయాలను తరలించే ప్రక్రియకు ప్రభుత్వ అధికారులు త్వరగా పూనుకోవాలి, ఐదారు రోజుల ముందుగానే ఉద్యోగులను రిలీవ్ చేయాలని అన్నారు. ఉన్నతాధికారుల కార్యాలయాల తరలింపు చురుగ్గా సాగడం లేదని, ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సీఎం చంద్రబాబు చొరవ చూపాలని కోరారు. ఆయా శాఖల ఉన్నతాధికారులతో సీఎం తక్షణం సమావేశం కావాలని, రాజధానికి తరలివచ్చే ఉద్యోగుల సందేహాల నివృత్తికి ‘హెల్ప్ డెస్క్’ లు ఏర్పాటు చేయాలని కోరారు. ‘స్థానికత’ ఉత్తర్వులపై కేంద్రం తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని, రెవెన్యూ శాఖలో ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.