: కేజీ -డీ6 వివాదంలో మధ్యవర్తి పేరును చెప్పలేకపోయిన రిలయన్స్


కేజీ-డీ6 చమురు క్షేత్రంలో నెలకొన్న వివాదాలను పరిష్కరించుకునేందుకు ఏర్పాటు కానున్న మధ్యవర్తుల కమిటీకి తనవంతుగా ఎవరు వ్యవహరిస్తారన్న విషయాన్ని రిలయన్స్ వెల్లడించక పోవడంతో, నోటీసులిక చెల్లవని చమురు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆర్బిట్రేటర్ ను తెలియజేయడంలో రిలయన్స్ విఫలమైనందున కేజీ-డీ6లోని ఐదు బావులను తాము తిరిగి స్వాధీనం చేసుకునే వీలు కలిగిందని చమురు శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. గత సంవత్సరం ప్రొడక్షన్ షేరింగ్ కాంట్రాక్టు విషయంలో వివాదం తలెత్తగా, చమురు శాఖకు రిలయన్స్ నోటీసులు పంపింది. వివాదం పరిష్కారం కోసం ఆర్ఐఎల్, దాని భాగస్వామి నికో ఒక మధ్యవర్తిని, ప్రభుత్వం మరో మధ్యవర్తిని నియమించుకోవాల్సి వుంది. వీరికి అదనంగా ఓ స్వతంత్ర న్యాయమూర్తిని కలిపి ముగ్గురు సభ్యుల ఆర్బిట్రేషన్ ప్యానల్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నోటీసులు పంపి, రిలయన్స్ కు ఆరు నెలల సమయం ఇవ్వగా, మధ్యవర్తి పేరును వెల్లడించడంలో రిలయన్స్ విఫలం కావడంతో సాంకేతికంగా, వారి నోటీసుకు విలువ లేకుండా పోయిందని, ఇక వివాదంపై తన వ్యాఖ్యలను వినిపించాలంటే, మరో నోటీసును సంస్థ ఇవ్వాల్సి వుంటుందని చమురు శాఖ అధికారులు తెలిపారు. కాగా, ఇదే చమురు క్షేత్రంలో 30 శాతం వాటా ఉన్న బీపీ పీఎల్సీ అసలు ఆర్బిట్రేషన్ నోటీసులపై సంతకాలు కూడా చేయక పోవడం గమనార్హం. మొత్తం 7,645 చదరపు కి.మీ విస్తరించిన కృష్ణా గోదావరి బేసిన్ లో చమురు, సహజవాయువు వెలికితీత అనుమతులు పొందిన రిలయన్స్, ఎలాంటి గ్యాస్ లేదని చెబుతూ, 5,385 చదరపు కి.మీ ప్రాంతాన్ని వెనక్కు ఇచ్చేందుకు 2013లోనే ప్రభుత్వానికి ఆఫర్ ఇచ్చింది. ఆపై అదే సంవత్సరం అక్టోబరులో, ఉత్పత్తి కాలం ముగిసినా, చమురును కనుగొనడంలో విఫలమైందని ఆరోపిస్తూ, 6,198 చదరపు కి.మీ ప్రాంతాన్ని వెనక్కివ్వాలని కేంద్రం ఆదేశించడంతో వివాదం మొదలైంది. ఈ ఆదేశాలను జనవరి 2014లో రిలయన్స్ సవాలు చేసింది. అప్పటి నుంచి కేంద్రం, రిలయన్స్ మధ్య ఈ కేసు నడుస్తూ ఉండగా, తమ సహజవాయువు రిలయన్స్ బావుల్లోకి వెళుతోందని, ఆ గ్యాస్ విక్రయ ఆదాయంపై తమకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ఓఎన్జీసీ మరో వివాదాన్ని తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News