: రేపు లొంగిపోనున్న కాల్ మనీ - సెక్స్ రాకెట్ నిందితుడు వెనిగళ్ల శ్రీకాంత్!
విజయవాడ కేంద్రంగా జరిగిన కాల్ మనీ - సెక్స్ రాకెట్ ప్రధాన నిందితుల్లో ఒకరైన వెనిగళ్ల శ్రీకాంత్, రేపు విజయవాడ కోర్టులో లొంగిపోనున్నట్టు తెలుస్తోంది. పోలీసులకు దొరికితే, వాస్తవాలను చెప్పాల్సి వస్తుందని, అదే జరిగితే, తమ పేర్లు బయటకు వస్తాయని భావిస్తున్న రాజకీయ నేతలు, శ్రీకాంత్ ను డైరెక్టుగా కోర్టులో లొంగిపోయేలా ప్రణాళికలు రూపొందించారని, ఇందుకు హైదరాబాద్ లోని ఓ పోలీసు అధికారి సహకరిస్తున్నారని దినపత్రికల్లో వార్తలు వచ్చాయి. గత వారంలోనే శ్రీకాంత్ లొంగిపోవాల్సి వున్నప్పటికీ, నవ నిర్మాణ దీక్షల్లో నేతలు బిజీగా ఉన్న నేపథ్యంలో లొంగుబాటు వాయిదా పడిందని సమాచారం. కోర్టులో లొంగిపోయి, ఆపై అనారోగ్య కారణాలు చూపి బెయిల్ కోరాలని శ్రీకాంత్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, వారం క్రితమే శ్రీకాంత్ నగరానికి వచ్చాడని, ఆయన నాయనమ్మ మరణించగా, అంత్యక్రియల్లో పాల్గొన్నాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే, తాము వెళ్లేలోగానే శ్రీకాంత్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.