: అఖిల భారత సర్వీసుల్లో వివక్ష కొనసాగుతోంది... దళిత్, ముస్లిం మహాసంఘ్ ఆరోపణ
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్షల ఇంటర్వ్యూల్లో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల పట్ల వివక్ష కొనసాగుతోందని అఖిల భారత దళిత్, ముస్లిం మహాసంఘ్ నాయకులు ఆరోపించారు. ఢిల్లీలో వారు మాట్లాడుతూ, లిఖిత పరీక్షల్లో సాధారణ అభ్యర్థుల కంటే అత్యధిక మార్కులు సాధిస్తున్న దళితులు ముఖాముఖి ఇంటర్వ్యూల్లోకి వచ్చేసరికి తక్కువ మార్కులు సాధించడం వెనుక కారణం వివక్షేనని తెలిపారు. ఇంటర్వ్యూ నిర్వహించే వారు సంకుచిత బుద్ధితో ఇలా ఎస్సీ, ఎస్టీల పట్ల వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇలా జరగడం వల్ల ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు అన్యాయానికి గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.