: జాబు కావాలంటే బాబు రావాలన్నారు... మరి జాబులేవీ?: జగన్
జాబు కావాలంటే బాబు రావాలని ప్రసారమాధ్యమాల్లో ఊదరగొట్టారని, మరి బాబు అధికారంలోకి వచ్చారు... జాబులేవి? అని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. అనంతపురం జిల్లా కదిరిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేకహోదాపై కేంద్రంతో మెతకవైఖరి ఎందుకు అవలంబిస్తున్నారని నిలదీశారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు కట్టుకుంటూపోతుంటే నోరుమూసుకుని ఎందుకు ఉంటున్నారని ఆయన అడిగారు. రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం వల్ల అనంతపురంలో రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు. డ్వాక్రా మహిళలను చంద్రబాబు నిలువునా మోసం చేశారని ఆయన చెప్పారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో బుక్కైన చంద్రబాబు అక్కడి కెళ్లేందుకు ముఖం చెల్లక వారితో వాటాలు తేల్చుకోలేకపోతున్నారని ఆయన తెలిపారు. పేదలకు పక్కా ఇళ్లు కట్టిస్తానని బాబు హామీ ఇచ్చి, మోసం చేశారని అన్నారు. ఇదే వైఖరి కొనసాగితే రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో పడుతుందని ఆయన తెలిపారు.