: బీజేపీ తీరే అంత...పిల్లలు, మహిళలని చంపమనాలా?: అఖిలేష్ యాదవ్ ప్రశ్న
ఉత్తరప్రదేశ్ లోని జవహర్ నగర్ పార్క్ లో చోటుచేసుకున్న ఘటనపై బీజేపీ చేస్తున్న విమర్శలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజకీయాలు చేసుకునే సమయమా? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీకి విద్వేషాలు రేపడం తప్ప ఇంకేమీ తెలియదని ఆయన మండిపడ్డారు. జవహర్ నగర్ లో అక్రమంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారంతా విధ్వంసకారులు కాదని అన్నారు. 'వారిలో పిల్లలు, మహిళలు ఉన్నారు. వారిని చంపేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీచేయాలని బీజేపీ చెబుతోందా?' అని ముఖ్యమంత్రి నిలదీశారు. ఇప్పటికే అక్కడి వారికి కోర్టు ఆదేశాల గురించి అధికారులు వివరిస్తున్నారు. అలాగే ఆ పరిసరాల్లో విద్యుత్, నల్లా కనెక్షన్లు కట్ చేశాం, ఇలా విడతలవారీగా అక్కడి వారిని ఖాళీ చేయించేందుకు పనులు చేపట్టామని ఆయన చెప్పారు. విధుల్లో ఉన్న ఉద్యోగులను కోల్పోతే ఆ కుటుంబాలకే కాదు, రాష్ట్రానికి కూడా తీరని నష్టం వాటిల్లుతుందన్న విషయం అంతా గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. విధుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం సరిపోదన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వంలో ఉందని ఆయన చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చే విషయం గురించి ఆలోచిస్తున్నామని ఆయన తెలిపారు. జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించామని, వాస్తవాలు వెల్లడయ్యేవరకు ఓపికపట్టాలని, దోషులను వదిలే ప్రశ్నేలేదని ఆయన స్పష్టం చేశారు.