: మధుర విధ్వంసకారుల డిమాండ్లు వింటే షాకవ్వాల్సిందే!
ఉత్తరప్రదేశ్ లోని మధురలో మొన్న సాయంత్రం పెను విధ్వంసానికి పాల్పడ్డ భూ దురాక్రమణదారులకు సంబంధించి పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో తేలిన వివరాల్లోకెళితే... నగరంలోని ఓ పార్కును ఆక్రమించుకున్న విధ్వంసకారులంతా తమను తాము సుభాష్ చంద్రబోస్ అనుచరులుగా చెప్పుకుంటారు. ఆక్రమణలను కాపాడుకునేందుకు వారు ‘ఆజాద్ భారత్ వైదిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రాహి’ పేరిట ఓ బృందంగా ఏర్పడ్డారు. ‘స్వాధీన్ భారత్ సుభాష్ సేన’ పేరిట ఏర్పడ్డ మరో బృందం వీరికి మద్దతు ఇస్తోంది. గత కొంతకాలంగా ఈ రెండు బృందాలు విచిత్రమైన డిమాండ్లు చేస్తున్నాయి. దేశంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి పదవులకు ఎన్నికలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న వీరు... ప్రస్తుత కరెన్సీని రద్దు చేసి ఆజాద్ హింద్ ఫౌజ్ కరెన్సీని అమల్లోకి తేవాలని కోరుతున్నారు. ఇక 60 లీటర్ల డీజిల్ ను సింగిల్ రూపాయికే అందించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఇక 40 లీటర్ల పెట్రోల్ ను కేవలం ఒక్క రూపాయికే అందించాలంటూ వీరు చేస్తున్న డిమాండ్లు విని పోలీసులే షాకయ్యారట.