: ఢిల్లీ కిడ్నీ రాకెట్ లీడర్ తెలుగోడే!.. దేశవ్యాప్తంగా అపోలో ఆసుపత్రుల్లో తనిఖీలు!
దేశ రాజధాని ఢిల్లీలో నిన్న కలకలం రేపిన కిడ్నీ రాకెట్ కీలక సూత్రధారి తెలుగు నేలకు చెందిన రాజ్ కుమార్ అని పోలీసులు నిర్ధారించారు. నిన్న నాటకీయ పరిణామాల మధ్య వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ లో పోలీసులు ఇద్దరు అపోలో సిబ్బంది సహా మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో రాజ్ కుమార్ కూడా ఒకడిగా ఉన్నాడు. ఏపీకి చెందిన ఇతడే ఈ రాకెట్ ను నడుపుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రైవేట్ వైద్య రంగంలో పేరెన్నికగన్న అపోలో ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది ఈ రాకెట్ లో ఉండటంతో దేశవ్యాప్తంగా సదరు ఆసుపత్రికి చెందిన ఇతర అన్ని శాఖల్లోనూ పోలీసులు సోదాలకు తెర తీశారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో అపోలో ఆసుపత్రికి చెందిన సిబ్బందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే, నిన్న పట్టుబడ్డ నిందితులు... గతేడాది కోయంబత్తూరులో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్ కు చెందిన నిందితులేనన్న విషయం తెలుసుకున్న పోలీసులు సోదాలను మరింత ముమ్మరం చేశారు.