: తిరుపతి వెంకన్నకు విరాళంగా అశోక్ లైలాండ్ 'లారీ'!
తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడికి ఆయన భక్తులు భారీగా విరాళాలు సమర్పించుకునే సంఘటనలు తరుచూ జరుగుతూనే ఉంటాయి. కొంత మంది తమ పేరు రాయించుకొని విరాళాలు అందజేస్తే, మరి కొందరు కనీసం తమ పేరయినా చెప్పకుండా శ్రీవారికి కానుకలు సమర్పిస్తుంటారు. ఈరోజు ఉదయం వెంకన్నకు అశోక్ లైలాండ్ సంస్థ ఓ లారీని కానుకగా అందజేసింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆ సంస్థ ప్రతినిధులు దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ ఈవో సాంబశివరావుకు లారీకి సంబంధించిన పత్రాలను అందజేసి, విరాళంగా అందిస్తున్నామని తెలిపారు. దేవస్థాన అవసరార్థం ఈ లారీని ఉపయోగించనున్నారు.