: 62 అడుగుల పొడవైన తల జుట్టుతో రికార్డు కొడుతున్న మనోడు!
మనదేశానికి చెందిన సావిభాయి రత్వా వయస్సు 60 ఏళ్లు... ఆయన తల వెంట్రుకల పొడవు 62 అడుగులు. అందుకే, గతంలో ఉన్న ప్రపంచ రికార్డును అధిగమించి ఇప్పుడీయన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కడానికి రెడీ అవుతున్నాడు. ఇందుకు సంబంధించి గిన్నిస్ సంస్థకు తన వివరాలు, రుజువులతో దరఖాస్తు కూడా పెట్టుకుంటున్నాడు. గుజరాత్ లోని సురేంద్ర నగర్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన సావిభాయి తన జుట్టును ఈ విధంగా పెంచడం కోసం తాను తీసుకున్న జాగ్రత్తలను గురించి ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. తాను బయటకు వెళ్లేటప్పుడు తన కేశాలను తాడు చుట్టినట్లుగా చుట్టి చేతికి తగిలించుకుని వెళతానని, ఒక్కోసారి, ఈ కేశాలనే తలపాగాగా చుట్టుకుంటానని అన్నారు. తన కేశాలు బలంగా ఉండటం కోసం పండ్లు, కూరగాయలు బాగా తీసుకుంటానని చెప్పాడు. కేశ సంరక్షణ విషయానికొస్తే, రెండురోజులకొకసారి తలస్నానం చేస్తానని, ఆ కేశాలను ఆరబెట్టేందుకు తన మనవలు సహకరిస్తారని తెలిపారు. కాగా, 22 అడుగుల పొడవు గల కేశాలతో చైనాకు చెందిన జీక్విపింగ్ పేరిట గతంలో రికార్డు ఉండేది. 2010లో జీక్విపింగ్ చనిపోయే వరకు ఈ రికార్డు అదేవిధంగా ఉంది.