: ఒక్కో ఎమ్మెల్యేకు 30 నుంచి 40కోట్ల రూపాయలిచ్చి కొనుక్కుంటున్నారు: నిప్పులు చెరిగిన జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. అనంతపురం జిల్లా యాడికిలో ఈరోజు ఆయన మాట్లాడుతూ.. ఒక్కో ఎమ్మెల్యేకు 30 నుంచి 40కోట్ల రూపాయలిచ్చి చంద్రబాబు కొనుక్కుంటున్నారని ఆరోపించారు. ‘ఎమ్మెల్యేలను కొనేందుకు రూ.600 కోట్లు ఎలా వచ్చాయి?’ అని ఆయన ప్రశ్నించారు. ఇసుక నుంచి బొగ్గు కొనుగోలు వరకు అంతటిలోనూ అవినీతే జరుగుతోందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలపై చంద్రబాబు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని జగన్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మోదీని నిలదీసే ధైర్యం కూడా చంద్రబాబుకి లేదని ఆయన విమర్శించారు. ‘బాబు అవినీతిపై మోదీ విచారణ జరిపిస్తారనే భయం చంద్రబాబులో ఉంది’ అని ఆయన ఆరోపించారు. హోదా ఇవ్వకుంటే మంత్రులను వైదొలగమని ఎందుకు అల్టిమేటం ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అన్ని హామీలను ఇప్పుడు గాలికి వదిలేశారని జగన్ అన్నారు. ‘ఎన్నికల ముందు చెప్పిందేంటీ? ఇప్పుడు చేస్తోందేంటీ..?' అని ఆయన ప్రశ్నించారు. ‘చంద్రబాబు మీ ఆత్మసాక్షిని ఓసారి పరీక్షించుకోండి’ అని జగన్ వ్యాఖ్యానించారు.