: ఖడ్సేకు ఊస్టింగే!... మోదీ, అమిత్ షాలతో ఫడ్నవీస్ భేటీ!
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో లింకులు, అవినీతి ఆరోపణలు చుట్టుముట్టిన బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మంత్రి ఏక్ నాథ్ ఖడ్సేకు ఊస్టింగ్ ఆర్డర్స్ రెడీ అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. తొలుత దావూద్ ఇబ్రహీంతో లింకులతో వార్తల్లోకెక్కిన ఖడ్సేపై ఆ తర్వాత అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేయాలన్న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సూచనను ఖడ్సే పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో నేటి ఉదయం ఢిల్లీ చేరిన ఫడ్నవీస్... ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో కూడా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఖడ్సే వ్యవహారంపై ఫడ్నవీస్ వారిద్దరికీ వివరించారు. ఖడ్సే వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మోదీ, అమిత్ షా... ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించాలని ఫడ్నవీస్ కు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఢిల్లీ పర్యటన ముగించుకుని ముంబై చేరిన మరుక్షణమే ఖడ్సేను తన మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నట్లు ఫడ్నవీస్ ప్రకటించే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.