: 1997 ముందు కార్లను నిషేధిస్తున్న పారిస్
వాతావరణ కాలుష్యాన్ని అదుపులోకి తీసుకొచ్చే చర్యల్లో భాగంగా, పాత కార్ల వినియోగంపై పారిస్ ప్రభుత్వం నిషేధాన్ని ప్రకటించింది. 1997కు ముందు తయారైన కార్లు వచ్చే నెల నుంచి నగర రోడ్లపై తిరగడానికి వీల్లేకుండా నిషేధం విధించింది. జులై ఒకటి నుంచి అమల్లోకి రానున్న నిషేధం ప్రకారం 2000 సంవత్సరానికి ముందు తయారైన మోటార్ సైకిళ్లు కూడా సాధారణ రోజుల్లో పారిస్ నగరంలో తిరగడానికి వీలుండదు. నగరంలో ఇప్పటికే డీజిల్ ట్రక్కులు, భారీ వాహనాలపై నిషేధం అమల్లో ఉండగా, 2020 నాటికి 10 ఏళ్ల లోపు వాహనాలను మాత్రమే నగరంలో అనుమతించే విషయంపై తుది నిర్ణయానికి వచ్చే పనిలో పడింది పారిస్ సర్కార్. అయితే, మేయర్ తీసుకున్న ఈ తాజా నిర్ణయానికి ఎప్పటిలానే ఈసారి కూడా భారీ ఎత్తున నిరసన వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. మునుపటి నిర్ణయాలు వెలువడిన వెంటనే ద్విచక్రవాహనదారులు రోడ్లపై నిరసనగా తెలిపి, మేయర్ తో వాగ్వాదానికి దిగారు. ఈసారి కూడా ఇదే తరహా వాతావరణం నెలకొనే అవకాశం ఉంది.