: ఇది మనకు విభజన దినం... మన పొట్టగొట్టిన దినం!: చంద్రబాబు
కొత్త రాష్ట్రం ఏర్పడితే ఏ ప్రాంత ప్రజలైనా సంబరాలు జరుపుకుంటారని, కానీ ఆంధ్రప్రదేశ్‌లో విభజనతో జరిగిన అన్యాయం కారణంగా మనం ఈరోజు దీక్ష చేసుకుంటున్నామని రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని బెంజి సర్కిల్‌లో ఏర్పాటు చేసిన నవనిర్మాణ దీక్షలో ప్రతిజ్ఞ చేయించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘కలలో కూడా ఆలోచించలేదు, మనకు ఇంత అన్యాయం జరుగుతుందని. ఇటలీకి జూన్ 2 స్వాతంత్ర్య దినం.. మనకు విభజన దినం.. మన పొట్టగొట్టిన దినం’ అని ఆయన అన్నారు. విభజన చేయాలంటే ఆంధ్రకు న్యాయం చేయండని అప్పటి ప్రభుత్వాన్ని తాము కోరినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఒకవేళ విభజన వద్దంటే తెలంగాణను ఒప్పించండి అని అడిగినట్లు తెలిపారు. ఆనాటి ప్రభుత్వం మన సమస్యలను లెక్కచేయలేదని ఆయన అన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా విభజన ఆగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘తిరిగి కోలుకోలేనంత అన్యాయం జరిగింది, విభజనలో హేతుబద్ధత లేదు.. కుట్ర జరుగుతోందని పసిగట్టి ప్రజలంతా పోరాడారు’ అని ఆయన అన్నారు. ఎవరూ ఊహించని విధంగా అన్యాయంగా విభజన చేశారని చంద్రబాబు అన్నారు. అశోక్ బాబు ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాలు నిరసనలు తెలిపాయని, సమైక్యాంధ్ర ఉద్యమం కోసం విద్యార్థులు, ఉద్యోగులు అందరూ రోడ్డుపైకొచ్చారని ఆయన గుర్తు చేశారు. అయినా పార్లమెంటు తలుపులు మూసి, సీసీ కెమెరాలు ఆఫ్ చేయించి, చీకటిలో అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజన చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.