: అంతర్జాతీయ టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన కులశేఖర
శ్రీలంక సీనియర్ బౌలర్ నువాన్ కులశేఖర అంతర్జాతీయ టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. 2005లో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన కులశేఖర పదకొండేళ్లు లంక జట్టుకు సుదీర్ఘ సేవలందించాడు. లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేసే కులశేఖర, దిగ్గజాలు చమిందావాస్, ముత్తయ్య మురళీధరన్ లతో పాటు మలింగ, మెండిస్ వంటి వారితో కలిసి జట్టుకు సేవలందించాడు. తన రిటైర్మెంట్ పై సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాతే, టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నానని, ఈ నిర్ణయం ఈ క్షణం నుంచే వర్తిస్తుందని కులశేఖర జట్టు మేనేజ్ మెంట్ కు తెలిపాడు. ఇకపై వన్డే, టీ20 మ్యాచ్ లపై మరింత దృష్టి సారిస్తానని చెప్పాడు. ఇప్పటి వరకు 21 టెస్టులాడిన కులశేఖర 48 వికెట్లు తీశాడు. 173 వన్డేలు ఆడిన కులశేఖర 186 వికెట్లు తీయడం విశేషం. కులశేఖర వికెట్లు తీయకున్నా పరుగులివ్వడని అంతర్జాతీయ ఆటగాళ్లు పేర్కొంటారు.