: ఇక తప్పుకోవాల్సిన సమయం వచ్చింది: సోనియా చెప్పారన్న అమరీందర్ సింగ్


తనపై ఉన్న బాధ్యతలను మరొకరికి అప్పగించాల్సిన సమయం వచ్చిందని సోనియా గాంధీ వ్యాఖ్యానించినట్టు ఆ పార్టీ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ వెల్లడించారు. అతి త్వరలోనే రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని అన్నారు. గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం కావడం, ఆపై పార్టీకి శస్త్రచికిత్స చేయాల్సి వుందని దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 70వ పడిలోకి ప్రవేశించనున్న సోనియా, ఇక అధిక విశ్రాంతిని కోరుతూ, రాహుల్ ను ముందు నిలిపి, సలహాలు, సూచనలు ఇచ్చేందుకే పరిమితం కావాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 2014 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 44 సీట్లకు మాత్రమే పరిమితమైన సంగతి తెలిసిందే. ఆపై ఎన్నికలు జరిగిన అన్ని చోట్లా కాంగ్రెస్ కు పరాభవమే ఎదురైంది. ఇక వచ్చే సంవత్సరం యూపీలో ఎన్నికలు జరగనుండగా, సాధ్యమైనంత త్వరగా, పార్టీ అధ్యక్ష పీఠాన్ని రాహుల్ కు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. తాను తప్పుకోవాలని సోనియా తీసుకున్న నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని కెప్టెన్ సింగ్ తెలిపారు. వచ్చే యేడు పంజాబ్ కు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమరీందర్ సింగ్ నేతృత్వంలోనే పోటీ పడనుందన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News