: సుబ్రహ్మణ్యస్వామి ఆరోపణలకు చలించని మోదీ... రాజన్ కొనసాగింపే!
బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఎంత తీవ్రమైన ఆరోపణలు చేసినప్పటికీ, రఘురాం రాజన్ ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరుగా కొనసాగించేందుకే ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆర్బీఐ బాధ్యతలను రాజన్ చేపట్టిన తరువాత, మోదీ, రాజన్ ల నడుమ సత్సంబంధాలు కొనసాగాయని, ఆ బంధమే ఇప్పుడు ఆయనకు మరోసారి అవకాశాన్ని దగ్గర చేస్తోందని ఆర్థిక రంగ నిపుణులు వ్యాఖ్యానించారు. భారత ఆర్థిక వ్యవస్థ 2 ట్రిలియన్లను దాటి ముందుకు సాగనున్న తరుణంలో రాజన్ వంటి నిపుణుడి సేవలు అవసరమని మోదీకి పలువురు ప్రభుత్వ అధికారులు సైతం స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి రాజన్ హయాంలోనే భారత బ్యాంకింగ్ సెక్టారులో కీలక మార్పులు అమలయ్యాయి. అంతకుముందు వరకూ రుణాల మంజూరులో పాటించిన విధానాన్ని రాజన్ మరింత కఠినం చేశారు. బ్యాంకుల ఎన్పీఏ పెరగకుండా నిలువరించారు. వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తనవంతు కృషి చేశారు. ప్రధాని స్వయంగా ప్రవేశపెట్టిన జన్ ధన్ యోజన విజయవంతం కావడానికి రాజన్ తీసుకున్న చర్యలు కూడా కారణమయ్యాయి. వందల కోట్ల రూపాయల రుణాలను తీసుకుని వాటిని ఎగ్గొట్టిన బడాబాబులపై కఠిన చర్యలు ప్రారంభమయ్యాయి. రుణ ఎగవేతదారుల జాబితా సుప్రీంకోర్టుకు అందింది. ఇవన్నీ ప్రజల్లో ఆయన పేరుకు మద్దతు పెంచాయి. రాజన్ నే కొనసాగించాలని లక్షల మంది ఓ ఆన్ లైన్ పిటీషన్ లో సంతకాలు చేశారు. "రాజన్ అంగీకరిస్తే, ఆయనకు మరోసారి అవకాశం కచ్చితంగా లభిస్తుంది" అని ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అరవింద్ మాయారాం వ్యాఖ్యానించారు. భారత రాజకీయ వ్యవస్థ అడ్డుకున్నా, ఆ ప్రభావం ఆయనపై ఉండబోదని అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ గవర్నరుగా రాజన్ వంటి వ్యక్తి ఇండియాకు సేవలందించడాన్ని ప్రధాని గర్వంగా భావిస్తున్నారని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. ఆయనకు రెండో విడత అవకాశం దక్కి తీరుతుందని అన్నారు. కాగా, ఇటీవల వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తున్న వేళ, రాజన్ కొనసాగింపుపై నిర్ణయాన్ని సెప్టెంబరులో మాత్రమే తీసుకోగలమని వ్యాఖ్యానించడం గమనార్హం.