: అమ్మానాన్నలు తిడుతున్నారని పోలీసు స్టేషన్ మెట్లెక్కిన కృష్ణా జిల్లా చిన్నారులు
తమ తల్లిదండ్రులు తిడుతున్నారని చెబుతూ ఇద్దరు చిన్నారులు పోలీసు స్టేషన్ ను ఆశ్రయించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియాలోనూ ఇటువంటి ఘటనలు అత్యంత అరుదు. మరిన్ని వివరాల్లోకి వెళితే, కృష్ణా జిల్లా బావులపాడు మండలం వీరవల్లిలో సిద్ధూ (13), రేష్మి (8) అన్నా చెల్లెళ్లు. ఈ ఉదయం పోలీసు స్టేషనుకు వచ్చి, తమను అమ్మా నాన్నా తిడుతున్నారని ఫిర్యాదు చేయడంతో పోలీసులే విస్తుపోయారు. ఆపై ఇద్దరినీ కూర్చోబెట్టి వివరం అడిగారు. తమకు చదువుకోవాలని ఉన్నా, తల్లిదండ్రులు స్కూలుకు పంపడం లేదని వారు చెప్పారు. నిత్యమూ కొడుతున్నారని చెప్పారు. దీనిపై స్పందించిన పోలీసులు, చిన్నారుల ప్రయత్నాన్ని అభినందిస్తూ, వారి పెద్దలను పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్టు తెలిపారు. మొత్తం ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.