: చిక్కుల్లో వాద్రా!... ఆయుధ వ్యాపారితో సంబంధాలపై ఐబీ చేతిలో కీలక ఆధారాలు!
'దమ్ముంటే నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపండి' అని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విసిరిన సవాల్ ను బీజేపీ సర్కారు స్వీకరించినట్టే ఉంది. వివాదాస్పద ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ నుంచి సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా లండన్ లో ఓ లగ్జరీ ఫ్లాట్ ను బహుమతిగా స్వీకరించారని నిన్న వెలుగులోకి వచ్చిన ఆరోపణలపై సోనియా ఘాటుగా స్పందించారు. అయితే సోనియా వాదనలో పసలేదన్న కోణంలో మరింత వేగవంతమైన దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లుంది. ఈ క్రమంలో 2011లో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) రూపొందించిన ఓ నివేదిక బయటకు వచ్చింది. ఈ నివేదికలో సంజయ్ భండారీ... వాద్రాతో నిత్యం టచ్ లో ఉన్నట్లు సంచలన వివరాలున్నాయి. తన కంపెనీ పేరిట తీసుకున్న వాద్రా మొబైల్ ఫోన్ కు భండారీ పలుమార్లు ఫోన్లు చేశాడట. ఇక యూపీఏలో బొగ్గు శాఖ మంత్రిగా పనిచేసిన శ్రీప్రకాశ్ జైస్వాల్ తోనూ భండారీ పలుమార్లు మాట్లాడట. ఈ మేరకు ఐబీ నాడు రూపొందించిన నివేదిక ఆధారంగా వాద్రా చుట్టూ ఉచ్చు బిగించేందుకు దర్యాప్తు సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి.