: వారం రోజుల నవనిర్మాణ దీక్షలో ఏ రోజు ఏంటంటే..!
రాష్ట్ర విభజన ఇష్టపూర్వకంగా, ఆశించిన విధంగా జరగలేదని, ఈ కారణంతో మరింత కసిగా, కష్టపడి రాష్ట్రాభివృద్ధికి పునరంకితం కావాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వారం రోజుల నవనిర్మాణ దీక్ష, ప్రతిజ్ఞల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఏడు రోజుల పాటూ ప్రజలంతా దీక్షలో పాల్గొనేలా చూడాలని చంద్రబాబు స్వయంగా మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర ప్రజలంతా నవనిర్మాణ దీక్ష ప్రారంభ సూచకంగా ప్రతిజ్ఞ చేయాలన్నారు. శుక్రవారం నాడు అశాస్త్రీయ విభజన, ఆపై దాని ప్రభావం పడుతున్న అంశాలపై చర్చించాలని, శనివారం నాడు ఈ రెండేళ్లలో సాధించిన విజయాలను సమీక్షించాలని సూచించారు. 5వ తేదీన వ్యవసాయం, జలవనరులపై సమీక్షలు, 6వ తేదీన పారిశ్రామిక వృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపైన, 7వ తేదీన మానవ వనరుల అభివృద్ధిపై ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టుకుని చర్చించాలని సూచించారు. 8వ తేదీన ఒంగోలు లేదా రాజమండ్రిలో మహాసంకల్పం ఉంటుందని, ఆపై ఈ రెండేళ్ల పాలనలో ఆదాయ కొరత, అభివృద్ధి తదితర అంశాలపై తాను స్వయంగా మంత్రులు, అధికారులతో చర్చించనున్నట్టు చంద్రబాబు వివరించారు.