: 'ఆట' శివశంకర్ మాస్టర్ కుటుంబంలో వివాదం ... తనను వేధిస్తున్నారంటూ కోడలు ఆరోపణ!
'జీ' తెలుగు టీవీ చానెల్ లో ప్రసారమైన 'ఆట' ప్రోగ్రాం గుర్తుందా? అందులో న్యాయనిర్ణేతగా వ్యవహరించిన ప్రముఖ సినీ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ కుటుంబంలో వివాదం చోటుచేసుకుంది. పెద్ద కుమారుడు, కోడలు మధ్య చెలరేగిన వివాదం మలుపులు తిరుగుతోంది. తన భర్త, మామగారు కలసి తనకు నిలువనీడ లేకుండా చేస్తున్నారంటూ కోడలు తమిళనాడు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే... శివశంకర్ మాస్టర్ పెద్ద కుమారుడు విజయ్ కృష్ణ, కోడలు మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. ఈ నేపధ్యంలో విడాకులు కోరుతూ శివశంకర్ మాస్టర్ పెద్ద కుమారుడు తన భార్యకు నోటీసులు పంపాడు. దీంతో అతని భార్య తమ కుమార్తె బాగోగులు చూసుకునేందుకు పది కోట్ల రూపాయలు భరణం చెల్లించాలని డిమాండ్ చేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆమె శివశంకర్ మాస్టర్ కు చెందిన ఆస్తుల వివరాలను న్యాయస్థానానికి తన న్యాయవాది ద్వారా తెలిపిందట. ఈ వివాదం నేపథ్యంలో తమ కుమార్తె భవిష్యత్ గురించి ఆలోచించి, తన భార్యతో కలిసి ఉండేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే ఆమె మొండిగా వ్యవహరిస్తోందని, తమకు సరైన కౌన్సిలింగ్ కావాలని విజయ్ కృష్ణ తెలిపారు. అలాగే, ఆమె తమ కుటుంబంపై 498ఏ కేసు పెట్టిందని, వేధింపులు మానుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఆయన భార్య మాట్లాడుతూ, తనను వదిలించుకోవాలని చూస్తున్నవారు, తనకు విడాకుల నోటీసు పంపిన వారు ఇప్పుడు కలిసుందాం రమ్మని అడుగుతున్నారని, దానిని తానెలా నమ్మాలని ఆమె ప్రశ్నిస్తున్నారు. అందుకే తనకు భరోసా కావాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఇంతవరకు తనను వేధించిన వారు రేపు బాగా చూసుకుంటారన్న గ్యారెంటీ ఏమిటని, అందుకే తనకు న్యాయం కావాలని ఆమె డిమాండ్ చేశారు. ఇదిలా ఉంచితే... తామే అద్దె ఇంట్లో ఉంటున్నామని, అక్కడికి వచ్చి ఆమె ఆందోళన చేసి, తన పేరు చెడగొడుతోందని శివశంకర్ మాస్టర్ అన్నారు. అలాగే ఆమె తనపై అసత్య ఆరోపణలు చేస్తోందని అన్నారు. తాను ఆమె దగ్గరకు వెళ్లి యాసిడ్ దాడి చేయబోతే, తన కుమారుడు అడ్డుకోవడంతో దానినుంచి విరమించుకున్నానని చెబుతోందని ఆయన మండిపడ్డారు. కాగా, ఈ వివాదంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కల్పించుకోవాలని ముగ్గురూ డిమాండ్ చేయడం కొసమెరుపు.