: రాంమాధవ్ కు డబుల్ బొనాంజా!... రాజ్యసభ సీటుతో పాటు కేంద్ర మంత్రి పదవి కూడానట!
జాతీయ పార్టీ బీజేపీలో ఏపీకి చెందిన మరో నేత కీలక బాధ్యతలు చేపట్టడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురంకు చెందిన వారణాసి రాంమాధవ్... రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)లో అంచెలంచెలుగా ఎదిగారు. సామాన్య కర సేవకుడి స్థాయి నుంచి ఆయన ఆరెస్సెస్ జాతీయ కార్యవర్గ సభ్యుడి హోదా దాకా వెళ్లారు. ఆ పదవిలో ఉండగానే రెండేళ్ల క్రితం ప్రధానిగా నరేంద్ర మోదీ పదవీ బాధ్యతలు చేపట్టడం, ఆ తర్వాత రాంమాధవ్... బీజేపీలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగిపోయాయి. పార్టీలో చేరగానే బీజేపీ ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చేసింది. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనను గ్రాండ్ సక్సెస్ చేసే కీలక బాధ్యతలను భుజాన వేసుకున్న రాంమాధవ్... అందులోనూ సక్సెస్ అయ్యారు. తదనంతరం మొన్న జమ్మూ కాశ్మీర్, నిన్న అసోం రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయాల్లో రాంమాధవ్ పాత్ర కీలకమనే చెప్పాలి. తెర వెనుకే ఉండే రాంమాధవ్... రాజకీయ వ్యూహ రచనల్లో దిట్టగా పేరుగాంచారు. ఈ క్రమంలో ఆయనను రాజ్యసభకు నామినేట్ చేయాలని బీజేపీ అధిష్ఠానం దాదాపుగా నిర్ణయించింది. అయితే ఏ రాష్ట్రం నుంచి ఆయనను రాజ్యసభకు పంపాలన్న విషయం ఇంకా తేలకపోయినప్పటికీ, పెద్దల సభలో రాంమాధవ్ అడుగు పెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. రాజ్యసభలో రాంమాధవ్ కాలు పెట్టగానే ఆయనను తన కేబినెట్ లోకి తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ భావిస్తున్నారట. విదేశాంగ శాఖ సహాయ మంత్రి బాధ్యతలను రాంమాధవ్ కు అప్పజెప్పనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.