: రాజ్యసభ బరిలోనూ ‘క్యాంపు’ రాజకీయం!... కొత్త సంప్రదాయానికి వైఎస్ జగన్ శ్రీకారం!
ఏపీలో విపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లో సరికొత్త సంప్రదాయానికి తెర తీశారు. ఇప్పటిదాకా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల పాలకవర్గాల ఎన్నికలు, ఆయా సందర్భాల్లో ప్రభుత్వాలను పడగొట్టడం, కాపాడుకోవడం... తదితర లక్ష్యాల కోసం ఆయా పార్టీలు క్యాంపు రాజకీయాలను నడిపాయి. తాజాగా రాజ్యసభలో తన పార్టీకున్న ఎమ్మెల్యేల సంఖ్యతో ఈజీగానే ఓ సీటును గెలుచుకునే బలం ఉన్న జగన్... తన పార్టీ ఎమ్మెల్యేలను ‘క్యాంపు’లకు పంపించి... రాజ్యసభ బరిలోనూ సరికొత్తగా క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో 67 మందిని గెలిపించుకున్న జగన్... ప్రతిపక్షంలో కూర్చున్నారు. అయితే మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 67 మందిలో 17 మంది ఎమ్మెల్యేలు జగన్ కు హ్యాండిచ్చి టీడీపీలో చేరిపోయారు. దీంతో ప్రస్తుతం అసెంబ్లీలో జగన్ బలం 50కి కుదించుకుపోయింది. తాజాగా జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని జగన్ బరిలోకి దించారు. 36 మంది ఎమ్మెల్యేల బలంతోనే విజయసాయిని గెలిపించుకునే అవకాశం ఉన్నప్పటికీ... ఎక్కడ తన ఎమ్మెల్యేలు చేజారిపోతారోనన్న భయం జగన్ కు పట్టుకుంది. ఈ క్రమంలో పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలకు ఆయన ‘క్యాంపు’లను ఏర్పాటు చేశారు. ఆయా ఎమ్మెల్యేలను కుటుంబ సభ్యులతో సహా ‘క్యాంపు’లకు తరలించిన జగన్... వారిలో కొందరిని గోవాకు, మరికొందరిని కేరళకు పంపారట. ఇక నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అడిగిందే తడవుగా వారందరినీ జగన్ శ్రీలంకకు పంపారట. జగన్ క్యాంపు రాజకీయాలపై అటు అధికార టీడీపీతో పాటు ఇటు సొంత పార్టీ ఎమ్మెల్యేలే విస్మయం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.