: తప్పిపోయిన చిన్నారుల ఫొటోలను నాణేలపై ముద్రిస్తున్న దేశం
తప్పిపోయిన చిన్నారుల ఫొటోలను అధికారిక కరెన్సీ నాణేలపై ముద్రించేందుకు బెల్జియం సిద్ధమవుతోంది. ఆ దేశంలోని చైల్డ్ ఫోకస్ అనే స్వచ్ఛంద సంస్థ తప్పిపోయిన చిన్నారులు, లైంగిక వేధింపులకు గురైన చిన్నారులకు మద్దతుగా నిలుస్తోంది. తప్పిపోయిన చిన్నారులను ఎలాగైనా వారి కుటుంబాలతో కలపాలనే సదుద్దేశంతో ఈ వినూత్న ఆలోచన చేసింది. ‘వండర్ మెన్’ అనే ప్రకటనల ఏజెన్సీతో కలిసి ఈ వినూత్న కార్యక్రమాన్ని చైల్డ్ ఫోకస్ రూపొందించింది. ఈ విషయాన్ని బెల్జియం ఆర్థిక మంత్రితో చర్చించి ఈ ప్రయత్నాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చారు. ‘కాయిన్స్ ఆఫ్ హోప్’ పేరుతో నాణేలపై తప్పిపోయిన చిన్నారుల ఫొటోలను ముద్రించేందుకు ఏర్పాట్లు చేశారు. తప్పిపోయిన చిన్నారుల అంతర్జాతీయ దినోత్సవంను ఇటీవల నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరవై ఏళ్ల క్రితం తప్పిపోయిన రెండేళ్ల చిన్నారి లియమ్ వాండెన్ ఫొటోతో ఉన్న ఒక నాణేన్ని విడుదల చేశారు. మిలియన్ విలువ చేసే రెండు యూరోల నాణేలపై లియమ్ వాండెన్ ఫొటోను ముద్రించనున్నారు. అలాగే తప్పిపోయిన మరికొందరు చిన్నారుల ఫొటోలను నాణేలపై ముద్రించే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం. అయితే, ఈ పద్ధతి ప్రస్తుతం బెల్జియం దేశంలో మాత్రమే అమలు అవుతోంది. త్వరలోనే యూరప్ వ్యాప్తంగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘చైల్డ్ ఫోకస్’ ప్రతినిధులు మాట్లాడుతూ, తప్పిపోయిన చిన్నారుల గురించి ప్రకటలు ఇస్తే చూసేవాళ్ల సంఖ్య కంటే నాణేలపై వారి ఫొటోలను ముద్రిస్తే చూసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని అన్నారు. అందుకనే, ఈ వినూత్న కార్యక్రమం గురించి ప్రభుత్వ అధికారులకు చెప్పామని అన్నారు.