: కర్ణాటకలో ఓలా, ఉబెర్ క్యాబ్ సేవలను నిషేధించిన ప్రభుత్వం
మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ, కర్ణాటక రాష్ట్రంలో క్యాబ్ సేవల సంస్థలు ఉబెర్, ఓలాలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధాన్ని విధిస్తూ, తక్షణం సేవలను నిలిపివేయాలని ఆదేశించింది. ప్రయాణికులకు రవాణా సేవలను అందించేందుకు ఆ సంస్థలు ఏ విధమైన అనుమతులనూ తీసుకోలేదని ట్రాన్స్ పోర్టు కమిషనర్ వెల్లడించారు. తమను రవాణా శాఖ అధికారులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ, ఓలా, ఉబెర్ సంస్థలకు అనుబంధ క్యాబ్ డ్రైవర్లు నిరసనలకు దిగుతున్న నేపథ్యంలో ఈ ఉత్తర్వులు వెలువడటం గమనార్హం. క్యాబ్ డ్రైవర్లు నిబంధనలను అతిక్రమిస్తున్నారని 300కు పైగా ఫిర్యాదులు రావడంతో వారిపై ఉక్కుపాదం మోపగా, డ్రైవర్లు రోడ్డెక్కారు. క్యాబ్ లను నడుపుతున్న వారిలో ఎంతో మందికి లైసెన్స్ లు లేవని గుర్తించామని, లైసెన్స్ లు లేనివారికి తమ సంస్థ బ్రాండ్ ను ఉబెర్, ఓలాలు ఇచ్చి వ్యాపారం జరుపుకుంటున్నాయని రవాణా శాఖ అధికారులు వ్యాఖ్యానించారు. అందువల్లే మొత్తం సేవలను ఆపివేయాలని ఆదేశించినట్టు తెలిపారు.