: నెల్లూరు జిల్లాలో స్వల్ప భూకంపం
కొద్దిసేపటి క్రితం నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూకంపం సంభవించింది. ఈ ఉదయం 9 గంటల సమయంలో ఉదయగిరి, వరికుంటపాడు, సీతారామపురం తదితర మండలాల్లో భూమి కంపించగా, పలు ఇళ్ల గోడలు బీటలు వారాయి. అటకలపై ఉంచిన వస్తు సామాగ్రి కింద పడింది. దీంతో భయాందోళనలకు గురైన ప్రజలు బయటకు పరుగులు తీశారు. ప్రాణనష్టం ఏమీ సంభవించలేదు. కాగా, గత రెండు రోజుల వ్యవధిలో నెల్లూరు జిల్లాలో నాలుగు సార్లు భూమి కంపించిన సంగతి తెలిసిందే. నిన్న ప్రకాశం జిల్లాలోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. భూగర్భంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగానే ప్రకంపనలు వస్తున్నాయని అధికారులు వెల్లడించారు.