: ఆస్ట్రేలియాలో హైదరాబాదీ వివాహిత మృతి... శంషాబాదు ఎయిర్ పోర్టులో డెడ్ బాడీని వదిలి భర్త పరారీ!
వివాహ బంధంతో ఆనందోత్సాహాలతో భర్తతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లిన హైదరాబాదు యువతి నాలుగేళ్లు తిరగకముందే అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. భార్య మృతదేహాన్ని హైదరాబాదుకు తీసుకొచ్చిన ఆ భర్త శంషాబాదు ఎయిర్ పోర్టులోనే మాయమైపోయాడు. భార్య మృతదేహాన్ని అక్కడే వదిలేసి అతడు తిరిగి ఆస్ట్రేలియా విమానమెక్కినట్లు తెలుస్తోంది. వివరాల్లోకెళితే... హైదరాబాదులోని కూకట్ పల్లికి చెందిన రమ్యకృష్ణకు నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ మహంత్ తో పెళ్లైంది. వివాహ బంధంతో కొత్త జీవితం ప్రారంభించిన రమ్య భర్తతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లింది. ఈ లోగా ఏమైందో ఏమో తెలియదు కాని... రెండు రోజుల క్రితం ఆమె ఆస్ట్రేలియాలోనే అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. రమ్య తల్లిదండ్రులకు సమాచారాన్ని చేరవేసిన మహంత్ భార్య డెడ్ బాడీతో నిన్న రాత్రి శంషాబాదు విమానాశ్రయానికి చేరుకున్నాడు. అయితే ఎయిర్ పోర్టులోనే ఆమె డెడ్ బాడీని వదిలేసి అతడు అదృశ్యమయ్యాడు. బిడ్డ మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతమైన రమ్య తల్లిదండ్రులు ఆమె డెడ్ బాడీని తీసుకుని ఇంటికి వచ్చారు. అయితే అల్లుడు కనిపించకపోవడం, రమ్య మరణంపై వివరణ లేకపోవడంతో తమ కుమార్తెను మహంతే హత్య చేసి ఉంటాడని వారు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. మహంత్ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.