: కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన వార్నర్!... ఐపీఎల్ ఫైనల్ లో సన్ రైజర్స్!
ఐపీఎల్ తాజా సీజన్ లో నిన్న ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఫైనల్ మ్యాచ్ ఆడనున్న రెండో జట్టును నిర్ణయించే కీలక మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. హైదరాబాదు సన్ రైజర్స్, గుజరాత్ లయన్స్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ అసలు సిసలైన పోరాట పటిమ ప్రదర్శించాడు. జట్టు కెప్టెన్ గా టాస్ గెలిచిన మరుక్షణమే అతడు మ్యాచ్ కూడా నెగ్గి తీరాల్సిందేనన్నట్లు ముందుకు సాగాడు. ఓ వైపు సహచర బ్యాట్స్ మెన్ అంతా చేతులెత్తేసి పెవిలియన్ చేరుతున్నా... మొక్కవోని ధైర్యంతో బ్యాటును ఝుళిపించాడు. పటిష్టమైన లయన్స్ బౌలింగ్ ను తుత్తునియలు చేసిన వార్నర్ 58 బంతుల్లోనే 11 ఫోర్లు, మూడు సిక్సర్లతో 93 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్ లో తన జట్టుకు విజయం చేకూర్చి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వార్నర్... లయన్స్ జట్టును ఫస్ట్ బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. లయన్స్ బ్యాట్స్ మెన్ ను సన్ రైజర్స్ బౌలర్లు నిలువరించినా... ఆరోన్ ఫించ్ (50), రవీంద్ర జడేజా (19), డ్వేనీ బ్రేవో (20) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో లయన్స్ జట్టు 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఆ తర్వాత 163 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన సన్ రైజర్స్ కు లయన్స్ బౌలర్లు ఆదిలోనే షాకిచ్చారు. రైజర్స్ స్టార్ బ్యాట్స్ మన్ శిఖర్ ధావన్ (0) పరుగులేమీ చేయకుండానే రనౌట్ కాగా, యువరాజ్ సింగ్ (8), హెన్రిక్స్ (11), దీపక్ హుడా (4) తదితర బ్యాట్స్ మెన్ అంతా వెంటవెంటనే పెవిలియన్ చేరారు. ఈ క్రమంలో కెప్టెన్ గా తన బాధ్యతను గుర్తు చేసుకున్న వార్నర్... ఓ వైపు సహచరులు పెవిలియన్ కు క్యూ కడుతున్నా తాను మాత్రం క్రీజుకే అతుక్కుపోయాడు. కెప్టెన్ కు బిపుల్ శర్మ (27) పూర్తి మద్దతుగా నిలిచాడు. దీంతో విజయమే లక్ష్యంగా వీర విహారం చేసిన వార్నర్ లయన్స్ బౌలింగ్ ను తుత్తునియలు చేశాడు. కేవలం 58 బంతుల్లోనే అతడు 93 పరుగులు పిండుకున్నాడు. ఇంకో నాలుగు బంతులు మిగిలి ఉండగానే జట్టు స్కోరును 163 పరుగులకు చేర్చి జట్టును విజయతీరాలకు చేర్చాడు. వెరసి బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టుతో టైటిల్ పోరుకు తన జట్టుకు అర్హత సాధించిపెట్టాడు.