: కలెక్టర్లపై కస్సుమన్న కేఈ!... తాము రాసిన లేఖలకే దిక్కులేదని ఆవేదన!
ఏపీ కేబినెట్ లో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న టీడీపీ సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తి ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖను పర్యవేక్షిస్తున్నారు. అంటే... రాష్ట్రంలోని రెవెన్యూ యంత్రాంగం మొత్తం ఆయన అధీనంలో ఉందన్న మాట. అయితే రెవెన్యూ మంత్రి హోదాలో తాను రాసిన లేఖలకే కొందరు కలెక్టర్లు స్పందించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న విజయవాడలో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో భాగంగా ప్రసంగించిన సందర్భంగా కేఈ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. తన శాఖ పరిధి కిందకే వచ్చే కలెక్టర్లు తన మాటకు విలువ ఇవ్వడం లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు అక్కడ ఒకింత గంభీర వాతావరణాన్ని సృష్టించాయి. కలెక్టర్లంతా బాగానే పనిచేస్తున్నా... కొన్ని జిల్లాల్లో తమ లేఖలను కలెక్టర్లు పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.