: కమ్మేసిన మబ్బులతో జోరుగా కొనుగోళ్లు... 576 పాయింట్లు దుమికిన సెన్సెక్స్ బుల్!
ఈ సంవత్సరం రుతుపవనాలు వారం రోజుల ముందుగానే వస్తాయన్న వాతావరణ శాఖ అంచనాలకు తగ్గట్టుగా, దేశంలోని పలు ప్రాంతాలను మబ్బులు కమ్మడం, కొన్ని చోట్ల పడుతున్న వర్షాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును పెంచాయి. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సంకేతాలతో రెట్టించిన ఉత్సాహంతో మదుపరులు నూతన పెట్టుబడులు పెట్టగా సెన్సెక్స్ బుల్ హై జంప్ చేసింది. హెవీ వెయిట్ కంపెనీల ఈక్విటీలతో పాటు బ్యాంకింగ్, కాపిటల్ గూడ్స్ సెక్టార్ కంపెనీలు భారీ లాభాలను నమోదు చేశాయి. సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే 250 పాయింట్లకు పైగా లాభంలోకి వెళ్లిన సెన్సెక్స్ కు ఏ దశలోనూ అమ్మకాల ఒత్తిడి కనిపించలేదు. ఇన్వెస్టర్ల సంపద రూ. 1.50 లక్షల కోట్లకు పైగా పెరిగింది. బుధవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 575.70 పాయింట్లు పెరిగి 2.28 శాతం లాభంతో 25,881.17 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 186.05 పాయింట్లు పెరిగి 2.40 శాతం లాభంతో 7,934.90 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.97 శాతం, స్మాల్ కాప్ 0.94 శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 49 కంపెనీలు లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఆటో, బీహెచ్ఈఎల్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, సిప్లా, అశోక్ లేలాండ్, బజాజ్ ఫిన్ సర్వ్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, జీఎస్కే, అపోలో హాస్పిటల్స్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,719 కంపెనీలు ట్రేడింగ్ లో పాల్గొనగా, 1,580 కంపెనీలు లాభాలను, 958 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. మంగళవారం నాడు రూ. 95,41,920 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 97,02,584 కోట్లకు పెరిగింది.