: జై సురేష్ ప్రభు... ఒక్క ట్వీట్ పారిపోతున్న యువతులను తల్లిదండ్రుల వద్దకు చేర్చింది


తన శాఖ నిర్వహిస్తున్న ట్విట్టర్ ఖాతాకు వచ్చిన పోస్టును చూసిన వెంటనే, రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు చూపిన చొరవ ఇంటి నుంచి పారిపోతున్న 18 ఏళ్ల యువతులను తల్లిదండ్రుల వద్దకు చేర్చింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, పశ్చిమ బెంగాల్ లోని 14 నార్త్ పరగణాస్ కు చెందిన ఇద్దరు యువతులు సీబీఎస్ఈ పరీక్షలు రాసి తక్కువ మార్కులు తెచ్చుకుని, తల్లిదండ్రులు తిడతారన్న భయంతో పారిపోయారు. పిల్లలు కనిపించడం లేదని వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మొబైల్ ఫోన్లను ట్రాక్ చేయగా, వారిద్దరూ ముంబై వెళుతున్న రైల్లో ఉన్నట్టు వెల్లడైంది. ఆ వెంటనే ఓ యువతి తండ్రి రైల్వే మంత్రి సురేష్ ప్రభు సాయం కోరుతూ ట్వీట్ పెట్టాడు. అదే సమయంలో దాన్ని చూసిన సురేష్ ప్రభు వెంటనే స్పందించి, అధికారులందరినీ అలర్ట్ చేశారు. ఆ రైలు వెళుతున్న అన్ని స్టేషన్లలో ఆర్పీఎఫ్ దళాలను మోహరించారు. వారెక్కడైనా దిగుతారేమోనని గమనిస్తూ, ఒక్కో పెట్టెనూ సోదాలు చేయించారు. వారు ప్రయాణిస్తున్న గీతాంజలీ ఎక్స్ ప్రెస్, ముంబై సీఎస్టీకి మరో మూడు గంటల్లో చేరుతుందనగా, నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్లో యువతులను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. గతంలోనూ రైల్వే ట్విట్టర్ ఖాతాకు వచ్చిన పలు ఫిర్యాదులను సురేష్ ప్రభు వెంటనే పరిష్కరించి శభాష్ అనిపించుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News