: ఉత్తరాది వర్సెస్ దక్షిణాది!.... తిరుమలలో ‘పాక’ ప్రవీణుల ఫైటింగ్!
తిరుమల వెంకన్న కొండపై నిన్న రాత్రి తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఓ హోటల్ పనిచేస్తున్న వంట మాస్టర్ల మధ్య జరిగిన ఈ ఘర్షణలో పలువురు పాకశాస్త్ర ప్రవీణులు గాయాలపాలయ్యారు. పోలీసుల సమక్షంలో వారు కొట్టుకున్న తీరు పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వివరాల్లోకెళితే... తిరుమల కొండపై భక్తులకు ఆహారాన్ని అందించేందుకు పలు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు హోటళ్లను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చెందిన వారు తిరుమలకు వస్తున్న నేపథ్యంలో ఆయా హోటళ్లలో సౌత్, నార్త్ ఇండియన్ వంటకాలు అందుబాటులో ఉంటున్నాయి. వీటిని తయారుచేసేందుకు దక్షిణాది వంటవాళ్లతో పాటు ఉత్తరాదికి చెందిన వంట మాస్టర్లను కూడా ఆయా హోటళ్లు అక్కడ నియమించుకున్నాయి. ఓ హోటల్ లో పనిచేస్తున్న దక్షిణాది, ఉత్తరాది వంట మాస్టర్ల మధ్య ప్రాంతీయ విభేదాలు పొడచూపాయి. తమ భాష గొప్పదంటే... కాదు, తమ భాషే గొప్పదంటూ మొదలైన గొడవ.. వంటల ప్రాశస్త్యం దాకా వెళ్లింది. ఈ క్రమంలో ఇరు వర్గాలకు చెందిన వంట మాస్టర్లు ఫైటింగ్ కు దిగారు. వారిని నిలువరించేందుకు అక్కడికి పోలీసులు చేరుకున్నా వంట మాస్టర్లు ఏమాత్రం తగ్గలేదు. చేతికందిన వస్తువులతో పరస్పరం దాడులు చేసుకున్న వారంతా గాయాలపాలయ్యారు. ఆ తర్వాత మరింత మంది పోలీసులు అక్కడికి వచ్చి గాయాలపాలైన వంట మాస్టర్లను అశ్విని ఆసుపత్రికి తరలించారు.